కలం, సినిమా: తమిళ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (75) (Singer Krishnaraj Ramasamy) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయకుడిగా అడుగుపెట్టకముందు చేనేత కార్మికుడిగా పనిచేసిన ఆయన, సంగీతంపై ఉన్న అమితమైన ఆసక్తితో తీవ్రంగా శ్రమించి చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘తంజావూరు మన్ను ఎదుత్తు’, ‘తిరుపతి ఏళుమలై వెంకటేశా’, ‘కాత్తు అడిక్కుదు’ వంటి ఎన్నో ప్రజాదరణ పొందిన తమిళ పాటలకు ఆయన తన విశిష్టమైన గాత్రంతో ప్రాణం పోశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మరణించిన కొద్ది రోజుల్లోనే ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు, ఇష్టమైన గాయకుడైన కృష్ణరాజ్ కూడా తుదిశ్వాస విడవడం కోలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవా-కృష్ణరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలు శ్రోతలను అలరించాయి. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 300కు పైగా సినిమాల్లో పాటలు పాడి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ సీనియర్ గాయకుడి భౌతికకాయాన్ని ఆఖరి చూపుల కోసం ఆయన స్వగ్రామమైన సేలం జిల్లాలోని వేంబడిదళం గ్రామానికి తరలించారు.
కృష్ణరాజ్ అకాల మృతి పట్ల తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయం, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ ప్రతినిధులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణరాజ్ భౌతికకాయానికి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

