సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర‌స్థాయి అధికారుల పర్య‌ట‌న‌లు

క‌లం, మెద‌క్ బ్యూరో: ఎల్ నినో ప్ర‌భావం, క‌రువు పరిస్ధితులపై సంగారెడ్డి జిల్లాలో (Sangareddy Drought) రాష్ట్ర‌స్ధాయి అధికారులు.. క్షేత్ర‌స్ధాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డకుండా ప్రభుత్వం త‌రుపున ప్ర‌ణాళికల‌ రూపక‌ల్ప‌న కోసం ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యట‌నలు చేస్తున్నారు. స్థానిక అధికారులు, ప్ర‌జ‌ల‌తో మాట్ల‌డుతూ వారి అవ‌స‌రాల‌ను తెలుసుకోనే విధంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ్రామీణ, పట్ట‌ణ ప్రాంతాల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొవ‌డంతో పాటు, ప్ర‌జ‌ల అవ‌స‌రాలు వాటికి అనుగుణంగా ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న, అమ‌లు కోసం స్ధానికంగా ఉండే వివిధ శాఖ‌ల‌ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైనారు.

రంగంలోకి రాష్ట్ర‌స్థాయి అధికారులు..

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల కోసం శుక్రవారం సీఎస్ సంజ‌య్ జాజు సింగూరు ప్రాజెక్టును క్షేత్ర‌స్ధాయిలో ప‌రిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి ల‌భ్య‌త, తాగునీటి స‌ర‌ఫ‌రా, పంటల పరిస్థితి, వర్షపాతం, తాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా, పశుగ్రాసం లభ్యత, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై అధికారుల‌తో సమీక్షించారు.

తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వృథాను అరికట్టడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు ప్రజలు, రైతుల భాగస్వామ్యం కీలకమని సీఎస్ పేర్కొన్నారు. నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సూచించారు.

గ్రామాల వారీగా తాగునీటి అవసరాలను గుర్తించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కార్యాచరణ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అగ్రిమెంటేషన్ అవసరమైన పనులన్నింటినీ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో అవసరమైనప్పుడు నీటి రవాణా ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన బోర్‌వెల్ సిద్దం చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

గుమ్మడిదల మండలంతో వాణి ప్రసాద్ పర్యటన..

శుక్రవారం గుమ్మడిదల మండలంతో అధికారుల‌తో క‌లిసి ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిణి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్దానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, నీటి లభ్యత, సాగు వివరాలను తెలుసుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు పొలంలో ఫామ్ పాండ్స్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు తెలిపారు. అనంతరం గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో వాణి ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర స్ధాయి ఉన్న‌తాధికారులు ప‌ర్య‌టించ‌డం ద్వారా క్షేత్ర‌స్ధాయిలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తెలుసుకొవ‌డంతో పాటు, వాటికి అనుగుణంగా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక రూపొందించ‌డానికి అవ‌కాశం ఉటుంది. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అధికారుల‌కు ప్ర‌భుత్వ ప్రాధ‌న్య‌త‌ను తెలియ‌జేయ‌డంతో పాటు, వారికి దిశ‌నిర్ధేశం చేసే అవ‌కాశం ఉటుంది. ఉన్న‌తాధికారులు గ్రౌండ్ లెవ‌ల్ లో తిరుగుతుంటే.. కింది స్థాయి అధికారుల అల‌స‌త్వం, నిర్ల‌క్ష్యం లేకుండా ఉండాల్సిన ప‌రిస్ధితి ఉటుంది. వ‌ర్ష‌భావ ప‌రిస్ధితులు, ఎల్ నినో ప్ర‌భావం ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిరియ‌స్ తీసుకొవ‌డంతో రాష్ట్ర‌స్ధాయి అధికారులు నుండి కింది స్దాయి సిబ్బంది వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు లేకుండా చేసేప‌నిలో నిమ‌గ్న‌మౌతున్నారు.

ఈ మూడింటి మీదనే స్పెష‌ల్ ఫోక‌స్..

1.తాగునీటి స‌మ‌స్య‌లు త‌తెత్త‌కుండా చ‌ర్య‌లు..

ఎల్ నినో తాలుకు ప్ర‌భావం మొదలవ‌డంతో పాటు, రాష్ట్రంలో వ‌ర్ష‌భావ ప‌రిస్ధితుల కార‌ణంగా నీటి వ‌నరులైన ప్రాజెక్టులు, చెరువులు, కుంట‌లు పూర్తి ఎండి పోయి అందోళ‌న క‌న్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో తాగునీటి కోసం ఇబ్బందులు ప‌డే ప‌రిస్ధితులు క‌న్పిస్తున్నాయి. దీంతో ఉన్న జ‌ల‌వ‌న‌రుల‌ను ప్ర‌ణాళికబ‌ద్దంగా స‌ద్వినియోగం చేసుకొవ‌డంతో పాటు, గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌లో ప్ర‌త్య‌మ్న‌య ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌వ‌ల్సి ప‌రిస్ధితులు ఏర్ప‌డ్డాయి. ఈ క్రమంలోనే గ్రామాలవారీగా తాగునీటి అవసరాలు, నీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని సీఎస్, ఉన్న‌తాధికారులు సూచించారు.

వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీటి సరఫరాలో వృథాను అరికట్టి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా వాటర్ రిసోర్సెస్ కమిటీలకు అవగాహన కల్పించాలని, గ్రామస్థాయిలో నీటి సంరక్షణకు సంబంధించిన తీర్మానాలు చేయించాలని తెలిపారు. నీటి ల‌భ్య‌త లేని ప్రాంతాల్లో, అవ‌స‌రాల‌కు అనుగుణంగా బోర్లు వేయడానికి ప్ర‌ణాళిక‌తో సిద్ధం ఉండాల‌ని సూచించారు.

2.స‌క్ర‌మంగా విద్యుత్ స‌ర‌ఫరా..

వేస‌వికాలమా అన్న‌ట్టు రికార్డు స్థాయిలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో క‌రెంటు వినియోగం పెరుగుతుండ‌టంతో.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోత‌లు, స‌ర‌ఫ‌రా విష‌యంలో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌రెంటు కోత‌ల వ‌ల‌న రైతులు ప‌లు ప్రాంతాల్లో సబ్ స్టేష‌న్లు, రొడ్ల పైన‌ ధ‌ర్నాలు, అందోళ‌న చేస్తున్నారు. రానున్న రోజుల్లో క‌రెంటు ఇబ్బందులు పెరిగే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌న్పిస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వ‌రి సాగు చేయ‌డం రైతుల‌కు క‌ష్టంగా మారే అవ‌కాశ‌లు క‌న్పిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గి విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి.

ఈ క్రమంలోనే  రైతుల‌కు స‌మ‌స్య‌లు లేకుండా రాబోయే 10–15 రోజులు పంటల రక్షణకు కీలకమనిరాష్ట్రస్థాయి అధికారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పంటలకు తగిన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రతి వారం సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు.

3. ప్ర‌త్య‌మ్న‌య పంటల సాగుకు ప్రొత్స‌హం..

వర్షపాతం లోటు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల స్వల్పకాలిక కూరగాయ పంటలను సాగు ప్రణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు. రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆకుకూరలు, కూరగాయలను పండించడంతో పాటు కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందేలా సంబంధిత శాఖల అధికారులు తగిన సలహాలు, సూచనలు అందించాలని ఉన్నతాధికారులు తెలిపారు. ఆరుతడి, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణ‌యించారు.

ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలు చేతికొచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక వ్యవసాయాధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. రాబోయే యాసంగి సీజన్‌లో నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రైతులు ఆరుతడి పంటలు ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలవారీగా పంటల పరిస్థితిని పరిశీలించి, పంటల రక్షణకు రైతులకు తగిన సూచనలు అందించాలని రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థాయి, బోర్లలో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ల‌క్షలాది జీవాల‌కు పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులు, నీటి నిల్వ కుంటల నిర్మాణం వంటి పనులను గుర్తించి చేపట్టాలని, అవసరమైన పనుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>