కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో కందూర్ పెద్దవాగుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేస్తున్న రైతుల పాదయాత్రకు శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంపూర్ణ మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా బాహుబలి మోటార్లు ఉన్నా ఆన్ చేయలేదని, అది చేసి ఉంటే సాగునీరు మన పొలాలకు వచ్చేదని ఆయన అన్నారు.
మహబూబ్‌నగర్ పొలాలకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీళ్లు తీసుకు వెళ్తున్న మన ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఎల్ నినో ఉంటే కృష్ణా నీళ్లు కుప్పానికి ఎలా పోయాయో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి నీళ్లు వదిలించామని, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలు నీళ్లు తీసుకురాలేదని ఆరోపించారు. కేసులకు ఎవరూ భయపడవద్దు. నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన పోలీస్ అధికారులను వదిలిపెట్టమని, మంచిగా పని చేసిన అధికారులను అభినందిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

