కలం, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం రాంపల్లి (Rampalli) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంటలోని ఓ ఫంక్షన్కు హాజరై తిరిగి గోదావరిఖని మార్కండేయ కాలనీకి కారులో వస్తున్న ప్రయాణికులకు ఈ ప్రమాదం ఎదురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గురు యువకులు సహా మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. జమ్మికుంట నుంచి గోదావరిఖని మార్కండేయ కాలనీకి వస్తున్న కారు రాంపల్లి శివారులోకి వచ్చేసరికి మార్గమధ్యంలోని మూలమలుపు వద్ద అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించబోయింది. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద శబ్దం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు, క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

