కలం, వెబ్‌డెస్క్: నిన్నటివరకు మీ చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన మీ బుజ్జాయి.. ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడా. అదేనండీ, వాళ్లని బడిలో చేర్చే వేళయింది కదా! అయితే, మొదటిసారి స్కూల్‌కు పంపడం అంటే ఏదో నాలుగు పుస్తకాలు కొని, రంగురంగుల బ్యాగ్ సర్దడం మాత్రమే కాదు. చిన్నారుల మనసును, శరీరాన్ని ఆ కొత్త వాతావరణానికి అలవాటు చేయడం ఒక పెద్ద టాస్క్. మీ గారాల పట్టి ఏడవకుండా, హ్యాపీగా బడికి (School Readiness) వెళ్లాలంటే.. ఒక అమ్మగా మీరు మానసికంగా, ప్రాక్టికల్‌గా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఇప్పటివరకూ వాళ్ల మాటకు ఎదురే లేదు. వాళ్లు ఆడిందే ఆట… పాడిందే పాట! నచ్చినప్పుడు నిద్రలేస్తారు.. మెచ్చిందే తింటారు.. కోరుకున్నది తెచ్చిచ్చేవరకూ ఇంటిని కిష్కిందకాండ చేసేస్తారు. కానీ స్కూల్లో అలా కుదరదు కదా. పిల్లల్ని ఎంత పెద్ద బడిలో చేర్చినా, అక్కడ ఎన్ని హంగులు ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా వారికంటూ కొన్ని విషయాలు అర్థమయ్యేలా చేయాలి. అప్పుడే వారు పేచీ పెట్టకుండా స్కూలుకి వెళ్లగలుగుతారు. మరి అవేమిటో తెలుసుకుందాం.
షేరింగ్ నేర్పండి
సాధారణంగా పిల్లలు వారి వస్తువులను వేరేవారికి ఇవ్వరు. ఇంట్లో ప్రతి వస్తువూ తనదే అనే భావన పిల్లల్లో ఉంటుంది. కానీ స్కూల్లో అది కుదరదు. అందుకే, ‘ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ… మార్చుకుని ఆడుకుందాం’ అంటూ ఇంట్లోనే ఆటల ద్వారా షేరింగ్ నేర్పంచడం చాలా అవసరం. లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం కూడా అలవాటు చేయాలి. తోటివారితో పంచుకోవడం ఒక ‘ఫ్రెండ్షిప్ డీల్. ఇది వాళ్ల మధ్య స్నేహాన్ని పెంచి, ఇంటి బెంగను త్వరగా దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
టీచర్ ఒక సూపర్ హీరో
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు మారాం చేస్తుంటే టీచర్ కు చెప్పి కొట్టిస్తా అని పిల్లలను భయపెడుతుంటారు. కానీ అలా చెప్పడం వల్ల పిల్లలకు స్కూల్ అంటే జైలులా, టీచర్ ఒక విలన్ లా కనిపిస్తారు. కాబట్టి టీచర్ అంటే మనకు హెల్ప్ చేసే ‘సూపర్ హీరో’ అనే పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేయాలి. అలాగే, 20-30 మంది పిల్లల మధ్య టీచర్ కు తన అవసరం అర్థం కావాలంటే నోరు తెరిచి అడగడం నేర్పాలి. దాహం వేసినా, టాయిలెట్ వస్తున్నా సైగలు చేయకుండా స్పష్టంగా అడగడం ఇంట్లోనే ప్రాక్టీస్ చేయించాలి.
వారం రోజుల ముందే దినచర్య మార్చండి!
ఇప్పటివరకూ పిల్లలు వారికి నచ్చిన సమయానికి నిద్రలేవడం, నచ్చిందే తినడం చేస్తుంటారు. కాబట్టి స్కూల్ మొదలవ్వడానికి కనీసం వారం రోజుల ముందే పిల్లల డైలీ రొటీన్లో కొన్ని మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేపి సమయానికి టిఫిన్ తినడం, యూనిఫామ్, షూస్, బెల్ట్, టై వేసి ఇంట్లో కాసేపు కూర్చోబెట్టాలట. ఆ ఫిజికల్ చేంజ్ కి వాళ్ల బాడీ ట్యూన్ అవ్వాలి, లేదంటే ఆ ఇరిటేషన్‌తోనే స్కూల్లో ఏడుపులు మొదలవుతాయి. దుస్తులు ఎలా విప్పాలో, ఎలా వేసుకోవాలో కూడా పిల్లలకు నేర్పించడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
ఆకలి తీరేలా… ఆందోళన దూరం అయ్యేలా!
ఇప్పటి వరకు మన గారాల బుజ్జాయికి అమ్మే తినిపించి ఉంటుంది. కాబట్టి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ క్యాప్స్ వాళ్లంతట వాళ్లే ఓపెన్ చేసుకునేలా సాధన చేయించాలి. లేదంటే ఆకలి వేసినా బాక్స్ తెరవడం రాక, అడగలేక అలాగే కూర్చుంటారు. లంచ్ బ్యాగ్లో చాక్లెట్, బిస్కెట్, స్మైలీ ఇలా రోజుకో చిన్న సర్ప్రైజ్ పెట్టాలి. క్లాస్లో బోర్ కొట్టినప్పుడు లేదా అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఆందోళన మర్చిపోతారు. తరవాతి రోజు ఏం పెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు.
కంగారొద్దు… కామనే
మొదటిరోజు స్కూల్ నుంచి రాగానే షర్టు మీద సాంబార్ మరకలతో, మోకాలికి దుమ్ముతో వస్తే ఆందోళన చెందకండి. వాళ్లు కొత్త ‘లైఫ్’ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి వారం రోజులు ఏడ్చినా, లంచ్ బాక్స్ తినకుండా తెచ్చినా కంగారొద్దు, ఇది చాలా సాధారణం అంటున్నారు నిపుణులు.
- బడిలో అందరి బాటిల్స్, బ్యాగులు ఒకేలా ఉంటాయి కాబట్టి, పిల్లల వస్తువులపై వారి పేరు, మీ ఫోన్ నెంబర్ మార్కర్ తో కచ్చితంగా రాయండి.
- మీ పాప/బాబుకి ఏదైనా డస్ట్ అలర్జీ లేదా హెల్త్ ఇష్యూ ఉంటే క్లాస్ టీచర్‌కి, ఆయాలకి ముందే చెప్పండి. అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతున్నారు నిపుణులు.

