కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ (Nirmal Collectorate) ఎదురుగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. సీ4 బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న జరీనాబేగం ఇంటి వంటగది స్లాబ్ పైకప్పు(Roof Slab Collapse) పాక్షికంగా కూలిపోయింది. ఆ సమయంలో ఆమె హాలులో ఉండటంతో ప్రమాదం తప్పింది.
గత కొంతకాలంగా పైకప్పు నుంచి నీరు కారుతుందని, నిర్మాణ నాణ్యతలో లోపాలే ఇందుకు కారణమని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు పేర్కొన్నారు. పైకప్పుల నుంచి నీరు కారుతుండటంతో పలువురు లబ్ధిదారులు సొంత ఖర్చులతో ప్లాస్టరింగ్ చేయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, దెబ్బతిన్న స్లాబ్‌లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

