కలం, జగిత్యాల: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు.
ఒకే ప్రాంగణంలో నాలుగు గురుకులాలు..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పేద ప్రజలకు అందించగలిగే అత్యంత విలువైన సంపద విద్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కులగణనలోనూ విద్య ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న విషయం స్పష్టమైందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని 326 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని మంత్రి పొన్నం తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఒకే ప్రాంగణంలో నాలుగు గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన భవనాలను నిర్మించేలా చర్యలు చేపట్టిందన్నారు.
18 నెలల్లో పూర్తి చేసేలా ..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ… జగిత్యాలలో ఇటీవల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాటిపల్లిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురుకులాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల పెంపుతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్నట్లు తెలిపారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాటిపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2,600 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై సుమారు రూ.8.12 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని, ప్రస్తుతం వడ్డీ చెల్లింపుల భారం అధికంగా ఉందని పేర్కొన్నారు.
రూ.500 కోట్లతో పనులు..
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తాటిపల్లిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు విద్యనందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టగా, జిల్లాలో మొత్తం రూ.40 కోట్లతో పాఠశాలల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
రూ.50 కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయం, కోరుట్లలో రూ.45 కోట్ల వ్యయంతో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. గత రెండేళ్లలో జగిత్యాల జిల్లాలో విద్యారంగ మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సీఎంను కలిసిన వెంటనే..
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. బీసీ గురుకుల జూనియర్ కళాశాలను సందర్శించినప్పుడు డైట్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతున్నట్లు గమనించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసన్నాంబ, మున్సిపల్ ఛైర్పర్సన్ సమిండ్ల వాణి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దినేష్, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

