చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్ భర్త.. జహీరాబాద్‌లో కలకలం

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కౌన్సిలర్ భర్త వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పని ఆవేదన వ్యక్తం చేస్తూ, 18వ వార్డు రామ్‌నగర్‌కు చెందిన ఎంఐఎం కౌన్సిలర్ (Ramnagar AIMIM Councillor) సోనీ భర్త ఈర్మీయా కార్యాలయం ఎదుట తన చెప్పుతో తానే కొట్టుకుని నిరసన తెలిపారు.

ఇటీవల జరిగిన జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించింది. ఎంఐఎం తరఫున గెలిచిన కౌన్సిలర్ సోనీతో పాటు ఆమె భర్త ఈర్మీయా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఎన్నికల అనంతరం తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఈర్మీయా ఆరోపించారు. వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు మున్సిపల్ చైర్మన్, అధికారులను కోరినా స్పందన లేకపోయిందని విమర్శించారు.

తమను నమ్మి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, “కాంగ్రెస్ చైర్మన్‌కు మద్దతు ఇచ్చి ఘోరమైన తప్పు చేశాను. వార్డు ప్రజలను మోసం చేసినట్లైంది” అంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుటే తన చెప్పుతో తానే కొట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా, స్థానికంగా చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>