స్థానిక వ్యాపారులతో నష్టపోతున్న రైతులు!

కలం, నిజామాబాద్ బ్యూరో: వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరి సాగు గ‌ణ‌నీయంగా తగ్గింది. దీంతో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సాగైన ధాన్యానికి మాత్రం డిమాండ్ పెరిగింది. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ధాన్యం దిగుబడి అధికంగా ఉండటంతో మిర్యాలగూడ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాపారులు ఏజెంట్ల ద్వారా ఇక్కడి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర, బోనస్ కంటే ప్రైవేట్ వ్యాపారులు ఇచ్చే ధర ఎక్కువగా ఉండటంతో వారికే ఉత్పత్తులను అమ్మేందుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు.

సిండికేట్‌గా మారి.. ధరను తగ్గించి..

తొలుత క్వింటాలు పచ్చి ధాన్యాన్ని రూ.3 వేలకు కొన్నారు. తర్వాత ఆ ధర రూ.3,800కి చేరింది. ప్రస్తుతం రూ.3,400కు తగ్గింది. కొందరు స్థానిక వ్యాపారులు, ఏజెంట్లు మధ్యవర్తులు సిండికేట్‌గా మారి ఇతర ప్రాంతాల వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ధరలను నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము నష్టపోతున్నా మని, ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇక్కడి నుంచి తరలించిన ధాన్యం ధర ఇతర ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.4 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే వారు 15 రోజుల్లో నగదు చెల్లిస్తున్నారు. అంతకంటే ముందుగా సొమ్ము కావాలంటే చెల్లించాల్సిన మొత్తంలో ఒకశాతం కోత విధిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. నగదు కోసం కోతను భరించక తప్పడం లేదని వాపోతున్నారు..

స్థానిక వ్యాపారులతో నష్టాలు

వర్ని మండలంలో 10 రోజుల క్రితం వరికోతలు ప్రారంభమయ్యాయి. ఏపీ. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని మిర్యాలగూడ నుంచి వస్తున్న వ్యాపారులు క్వింటాలు రూ.3,600 వరకు వెచ్చించి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే క్వింటాలుకు రూ.3,800 చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకురాగా, స్థానికంగా ఉన్న వ్యాపారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా క్వింటాలు ధర అమాంతం రూ.3.300కి పడిపోయింది. మరోవైపు రైతులు తమ పంటను ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంటే స్థానికంగా ఉన్న వ్యాపారులు అడ్డుపడుతున్నారు. వారి బెదిరింపులతో వ్యాపారులు ధాన్యాన్ని కొనడంలేదు.

నిలిచిన వరి కోత మిషన్లు

గ్రామంలో 30 వరకు వరికోత మిషన్లు నిలిచిపోయాయని నందిపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిపేట మండలంలో కూడా వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం విక్రయానికి సిద్ధమవుతుండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులను ధాన్యం కొనకుండా స్థానిక వ్యాపారులు నిలువరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు కొనడం లేదన్న సమాచారంతో రైతులు వరికోతలను నిలిపివేస్తున్నారు. కోతలు ఆగడంతో నందిపేట మండలం తల్వేదలో సుమారు 30 వరకు హార్వెస్టర్లు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రైతులకు మంచి ధరలు వస్తుంటే స్థానికి వ్యాపారులు దక్కనివ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>