కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత రైతు సంఘం (AIKS) 36వ జాతీయ మహాసభలను అత్యంత ఉద్యమ స్ఫూర్తితో విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ (Pothineni Sudarshan) పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 37 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వతంత్ర తెలంగాణ గడ్డపై ఈ జాతీయ మహాసభలు జరగడం చారిత్రాత్మకమన్నారు.
నవంబర్ 15న 15 వేల మంది రెడ్షర్ట్ వాలంటీర్ల కవాతు, లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల ఒప్పందాలను ఎదిరిస్తూ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందిస్తామన్నారు. పంటలకు చట్టబద్ధ మద్దతు ధర, పేద రైతులకు నెలకు రూ. 10,000 పెన్షన్ డిమాండ్లతో పాటు విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
90 ఏళ్ల వీరోచిత పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో జరిగే ఈ మహాసభలను రైతాంగం విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, మాదినేని రమేష్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

