కలం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై డిప్యూటీ సీఎంవో (Deputy CMO) నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఓ వాట్సాప్ ఛానల్ నుంచి జరుగుతున్న ఈ ప్రచారమంతా ఫేక్ అని డిప్యూటీ సీఎంవో, జనసేన నేతలు కొట్టిపారేశారు. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారం వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డిప్యూటీ సీఎంవో పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వహిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఓ వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టి, డిప్యూటీ సీఎంవో పేరుతో నిర్వహిస్తున్న సదరు ఛానల్ ఫేక్ అని వెల్లడించారు.
ఈ ఛానల్ ద్వారా డిప్యూటీ సీఎంవో పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ నకిలీ చానల్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు నమ్మవద్దని, ఫాలో కావద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని సూచించారు.
Also Read : సీఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు
Follow Us On : WhatsApp

