కలం, వెబ్ డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) వేడి వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేరుకుని ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న ఎటువంటి భద్రత, అధికారిక కాన్వాయ్ లేకుండా ఒంటరిగా వెళ్లి సీఎంను కలిసిన పవన్ కల్యాణ్, నేడు మాత్రం తన అధికారిక కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం గమనార్హం.
గత రెండు రోజులుగా ఇరువురి నేతల మధ్య వరుసగా జరుగుతున్న ఈ కీలక భేటీలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కీలక సమావేశంలో పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి అనుసరించాల్సిన ప్రధాన వ్యూహాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు జడ్పీ ఛైర్పర్సన్ స్థానాల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకునే అంశంపై దృష్టి సారించారు.
నేతల మధ్య ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో అసమ్మతి లేదా రెబల్స్ ముప్పును అరికట్టడం వంటి పలు కీలక అంశాలు చర్చకు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే పరిషత్ ఎన్నికల సీట్ల కేటాయింపు ప్రక్రియపై నేడో, రేపో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికలు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube

