కొత్తగూడెంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్.. 49 వాహనాలు సీజ్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కేంద్రంలోని సఫాయి బస్తీ ఏరియాలో పోలీసులు శుక్రవారం నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (Cordon and Search Operation) కలకలం రేపింది. సరైన ధ్రువపత్రాలు లేని 49 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, భారీగా అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో సబ్ డివిజన్ పోలీసులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫాయి బస్తీలో ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

​ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 2 త్రిచక్ర వాహనాలను గుర్తించి మొత్తం 49 వాహనాలపై జరిమానాలు విధించి సీజ్ చేశారు. అదేవిధంగా నివాస ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 87 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​ఈ సందర్భంగా నిర్వహించిన కమ్యూనిటీ కనెక్ట్ సమావేశంలో డీఎస్పీ ఆదినారాయణ స్థానికులతో మాట్లాడారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఉండే కఠిన శిక్షల గురించి హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.

తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే సైబర్ మోసాలు, ఓటీపీ, యూపీఐ ఫ్రాడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మతసామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ​ఈ కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) ఆపరేషన్‌లో 3 టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సుమారు 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : ఎండిన పొలంలోనే బైక్‌తో యువరైతు వినూత్న నిరసన!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>