భూమి పొరల్లోంచి వేడి నీరు.. పగిడేరులో అరుదైన అద్భుతం!

కలం, ఖమ్మం బ్యూరో : ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు(Pagideru) గ్రామంలో భూగర్భం నుంచి నిరంతరాయంగా వేడి నీరు ఉబికి వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మారుమూల గ్రామంలో బోర్లు వేస్తే చల్లటి నీటికి బదులుగా వేడి నీరు రావడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఎలాంటి విద్యుత్ మోటార్ల సాయం లేకుండా సహజ పీడనంతో నీరు పైకి వస్తుండటంతో ఈ ప్రాంతం దేశంలోనే అరుదైన ఉష్ణ జలాల ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ వింత వెనుక దైవశక్తి కాకుండా సహజమైన భౌతిక, శాస్త్రీయ ప్రక్రియలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భూమి అంతర్భాగంలోని ఉష్ణం భూగర్భ జలాలను వేడెక్కిస్తుందని, రాతి పొరల మధ్య ఏర్పడే సహజ పీడనం కారణంగా బోర్లు వేసినప్పుడు నీరు పైకి వస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పగిడేరులో బయటకు వచ్చే వేడి నీటి ఉష్ణోగ్రత సుమారు 81 డిగ్రీల సెల్సియస్ ఉండగా, భూగర్భంలో ఉష్ణోగ్రతలు 180 నుంచి 220 డిగ్రీల వరకు ఉంటున్నట్లు సమాచారం. ఈ నీటిలో సల్ఫర్ వంటి ఖనిజ మూలకాలు కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రాంతంలోని భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించుకునేందుకు సింగరేణి సంస్థ (SCCL), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) పరిశోధనలు చేపట్టాయి. సింగరేణి ఆధ్వర్యంలో పగిడేరు ప్రాంతంలో 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి పరీక్షలు నిర్వహించారు. మణుగూరు–పగిడేరు ప్రాంతంలో సుమారు 3,500 మెగావాట్లకు పైగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

భూగర్భంలోని వేడిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణహిత ఇంధనానికి మార్గం సుగమం కానుంది. సింగరేణి, ఓఎన్జీసీ సంస్థలు పరిశోధనలను మరింత విస్తరించి వాణిజ్య స్థాయిలో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు, మేధావులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. మరోవైపు, అరుదైన వేడి నీటి ఊటలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుండటంతో పగిడేరు పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందుతోంది.

ప్రస్తుతం గ్రామ రైతులు ఈ సహజ వనరును సాగుకు వినియోగిస్తున్నారు. భూగర్భం నుంచి వచ్చే వేడి నీటిని పొలాల్లో కొంతసేపు నిల్వ ఉంచి చల్లారిన తర్వాత పంటలకు ఉపయోగిస్తున్నారు. విద్యుత్ మోటార్ల అవసరం లేకుండా నీరు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన సహజ వనరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి, జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడం ద్వారా పగిడేరు ప్రాంత అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>