కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ వామపక్షాలు, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు. “కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇండ్లు ఇస్తారా?” అంటూ విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. గురువారం ఖమ్మం ధర్నాచౌక్‌లో ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) ఎంపికలో ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే లబ్ది చేకూరుస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలను తక్షణమే రద్దు చేసి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఖర్చు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదని, ప్రజలు కట్టే పన్నులతో కూడిన ప్రజాధనమని స్పష్టం చేశారు.
ధర్నా అనంతరం నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు వద్ద గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతంరం జిల్లా కలెక్టర్‌ను కలిసి జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, బానోత్ చంద్రావతి, లింగాల కమల్‌రాజు, సీవై పుల్లయ్య, బండారు ఐలయ్యతో పాటు పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : ఇన్ స్టాలోకి సోనియా గాంధీ.. స్పెషల్ రీల్!
Follow Us On : WhatsApp

