పోలీసు అమరుల కుటుంబాలకు ప్రత్యేక అధికారి.. సీపీ కీలక ప్రకటన

కలం, నిజామాబాద్ బ్యూరో: శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల (Police Martyrs) త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు.

పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అనునిత్యం నిమగ్నం అయి ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే సీసీఎస్ కానిస్టేబుల్ వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబైలో తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో వారిని ఎదుర్కొనేందుకు కానిస్టేబుల్ తుకారాం చూపిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొని వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం, మహిళకు భద్రత కల్పించడం, అన్ని వర్గాల వారికి భరోసాగా నిలవడం వంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు.

పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 21 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.

అమరులైన పోలీసుల ప్రతి కుటుంబానికి స్థలం లభించే వరకు పట్టుదలతో పర్యవేక్షిస్తామని అన్నారు. అమరుల కుటుంబాలు తమ సాధకబాధకాలు తెలియజేసేందుకు వరుసలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామని తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు అమరుల కుటుంబాలను స్వయంగా కలిసి వారి అవసరాలను గుర్తిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఏ.సి.పి (ఎ.ఆర్) కృష్ణ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, సీఐలు, ఎస్ఐలు , పోలీసు సిబ్బంది , అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>