కలం, నిర్మల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వచ్చే నెల నవంబర్ 16లోపు పరీక్ష ఫీజు (SSC Exam Fee) చెల్లించాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న (Nirmal DEO Darshanam Bhojanna) శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 ఫీజు చెల్లించాలని సూచించారు. ఐఎఫ్‌ఎస్సీ పోర్టల్, సైబర్ ట్రెజరీ చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్‌సైట్‌లో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఫీజు చెల్లింపు అనంతరం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు విద్యార్థుల వివరాలను నవంబర్ 21లోపు ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. పరీక్ష ఫీజు చెల్లింపు, ఇతర వివరాల కోసం జిల్లా ప్రభుత్వ పరీక్షల అదనపు కమిషనర్ ముడారపు పరమేశ్వర్‌ను సంప్రదించాలని సూచించారు.

