కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బతుకమ్మలకు పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పూల బతుకమ్మలను పేర్చి, ఆయా శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వీరితో పాటుగా జిల్లా కలెక్టర్ బతుకమ్మ ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి, వ్యవసాయం, రైతులతో మమేకం అయ్యి ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు అన్ని సమస్యల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు రైతులకోసం ప్రార్థించాలని కోరారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఖజానా శాఖ అధికారి సరోజ, మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

