కలం, భైంసా : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) అన్నారు. సోమవారం భైంసా మండలంలోని బోరిగాం గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన ఐకేపీ భవనాన్ని, వానల్‌పాడ్ గ్రామంలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఐకేపీ భవనాన్ని ప్రారంభించారు. మొత్తం రూ.70 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతులు, మహిళా సంఘాలకు ఉపయోగపడేలా ఐకేపీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఐకేపీ భవనాల నిర్మాణంలో ముధోల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచులు నాగలక్ష్మి వినోద్, బోరిగాం సర్పంచ్ వందన లక్ష్మణ్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోళ్ల దత్తాత్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, భైంసా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పండిత్‌రావు పటేల్, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

