కలం, సత్తుపల్లి: నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నేత గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ.. రోజూ వినియోగించే ఉప్పు, పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
పెరగని ఆదాయాలు..
ధరలు పెరుగుతూ, మరోవైపు ఆదాయాలు పెరగకపోవడంతో పేదల జీవనం భారంగా మారి కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయని గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు గద్దల దేవన్న, సత్తుపల్లి మండల కోశాధికారి అయినపూడి సంతోష్, నాయకులు గంధం రాఘవులు పాల్గొన్నారు.

