కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ (MP Arvind Dharmapuri) న్యూఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ 12, 13వ తేదీల్లో జరిగిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే నేడు జరిగిన వాణిజ్య కమిటీ సమావేశంలో కూడా పాల్గొన్నారు. FCRA సవరణ బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ, వాటి వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టపరమైన నిబంధనల అమలు వంటి కీలక అంశాలపై చర్చించారు.
అక్టోబర్ 12, 13 తేదీల్లో జరిగిన సమావేశాల్లో వివిధ మత, సామాజిక, సేవా సంస్థల ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయ నిపుణులు, విద్యాసంస్థల ప్రతినిధుల నుంచి బిల్లుపై అభిప్రాయాలు, సూచనలను కమిటీ స్వీకరించింది. విదేశాల నుంచి అందే నిధులు చట్టబద్ధమైన మార్గాల్లో వినియోగించబడేలా చూడటం, నిధుల వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, సంబంధిత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వాణిజ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ
అక్టోబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన వాణిజ్య కమిటీ సమావేశంలోనూ ఎంపీ అర్వింద్ ధర్మపురి పాల్గొన్నారు. దేశ వాణిజ్య రంగ అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఎగుమతుల ప్రోత్సాహం, దేశీయ పరిశ్రమలకు అవకాశాల కల్పన, వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలపై పార్లమెంటరీ కమిటీల ద్వారా జరిగే పరిశీలనలు, చర్చలు దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైనవి. పార్లమెంటరీ కమిటీల సభ్యుడిగా వివిధ రంగాలకు సంబంధించిన విధానపరమైన అంశాల పరిశీలనలో భాగస్వామ్యం కావడం ద్వారా ఎంపీ అర్వింద్ ధర్మపురి దేశ అభివృద్ధికి సంబంధించిన చర్చల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన అమలు అత్యంత కీలకమని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో పాల్గొని, దేశ అభివృద్ధికి దోహదపడే విధానపరమైన చర్చల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

