కలం, స్పోర్ట్స్: దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్న మహమ్మద్ షమీ (Mohammed Shami)కి మరోసారి నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. అక్టోబర్ 16న ప్రకటించిన జట్టులో షమీని ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. షమీ ఎంపికపై మాజీ భారత బ్యాటర్ అభినవ్ ముకుంద్ స్పందించాడు. వయసు కారణంగా షమీని పక్కనపెట్టారని తాను భావించడం లేదని తెలిపాడు. భువనేశ్వర్ కుమార్‌కు టీ20 జట్టులో తిరిగి అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించాడు. షమీని ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద నిర్దిష్ట కారణాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ.. చివరిసారిగా 2023 జూన్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడికి ఈ ఫార్మాట్‌లో మళ్లీ అవకాశం రాలేదు. మరోవైపు, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లకు కూడా చోటు దక్కింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో కలిపి భారత జట్టులో ఐదుగురు పేసర్లు ఉన్నారు.
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఆకాష్ దీప్ ఎంపిక సరైన నిర్ణయమని ముకుంద్ అభిప్రాయపడ్డాడు. అన్షుల్ కాంబోజ్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అయితే, ఈ సిరీస్‌లో కాంబోజ్‌కు ఆడే అవకాశం వస్తుందా లేదా అన్నది స్పష్టంగా లేదని తెలిపాడు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 27న క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.

