కలం, వనపర్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వనపర్తి (Wanaparthy)లో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోంది. వివేకానంద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్లో భాగంగా నాలుగో రోజు నాగవరం, పెబ్బేరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం మ్యాచ్ను వీక్షించి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ పోటీలో పెబ్బేరు జట్టు విజయం సాధించింది. ఆ జట్టు క్రీడాకారులను బీజేపీ నాయకులు అభినందించారు.
యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని, ఆటలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. యువతకు క్రీడా అవకాశాలు కల్పించే టోర్నమెంట్ల నిర్వహణ అభినందనీయమన్నారు. టోర్నమెంట్లో భాగంగా బుధవారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. క్రీడాభిమానులు, యువత అధిక సంఖ్యలో హాజరై పోటీలను వీక్షించాలని కోరారు.

