కలం, నల్లగొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక లోకం ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikkanti Satyam) పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్.రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలంగా మార్చివేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లకు పాతర వేస్తున్నారని నెల్లికంటి సత్యం మండిపడ్డారు. చివరికి రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని ఓట్లు తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఎప్పుడూ ముందుండి పోరాడాలని ఆయన (Nellikkanti Satyam) ఆకాంక్షించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం దురదృష్టకరమన్నారు.
దీనివల్ల కార్మికులకు సంఘం పెట్టుకునే, పోరాడే, సమ్మె చేసే హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా పాలకులు నియంత్నించడంలో విఫలమయ్యారని, దీంతో సామాన్య కార్మికులు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పురోగతి లేదని విమర్శించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల టెండర్ల కాలపరిమితి ముగిసినా పాత వాటినే కొనసాగిస్తూ తక్కువ వేతనాలతో శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వంటి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 31న ఏఐటీయూసీ అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని కేంద్రాల్లో జెండాలు ఎగురవేసి సభలు, సమావేశాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్ రెడ్డి, జిల్లా నాయకులు దొటి వెంకన్న, నూనె వెంకటేశ్వర్లు, బరిగెల వెంకటేష్, ఎండి జానీ, డి.వెంకటేశ్వర్లు, బంటు రాజేశ్వరి, వి. లెనిన్, బెల్లం శివయ్య, కోట్ల శోభ, వి.రమాదేవి, సరిత, జయమ్మ, రమణ, షమీం, ఎం.నందం, బి.వెంకటయ్య, గుండె రవి, ఆర్.యాదయ్య, నరేందర్ నాగార్జున, బి.లింగం, జవహర్లాల్, వెంకట్రాములు, మల్లయ్య, అమీర్, నరసింహ, వెంకన్న, పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

