వనపర్తిలో కుష్టు వ్యాధిపై ప్రత్యేక నిఘా.. 542 బృందాలతో ఇంటింటి సర్వే!

కలం, వనపర్తి: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్ నాయక్ కోరారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 14 రోజుల పాటు కుష్టు వ్యాధి గుర్తింపు (Leprosy Detection) ఉద్యమం (ఎల్‌సీడీసీ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం వనపర్తి (Wanaparthy) పట్టణ పరిధిలో జరుగుతున్న సర్వేను ఆయన తనిఖీ చేసి, కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 542 బృందాలుగా ఏర్పడిన ఆశా కార్యకర్తలు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులందరినీ పరీక్షించనున్నారు.

ఒక్కో బృందం రోజుకు 20 ఇళ్లను సందర్శించి వ్యాధి లక్షణాలను గుర్తించనుంది. చర్మంపై స్పర్శ తెలియని మచ్చలు, తెల్లటి లేదా రాగి రంగు మచ్చలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గడం, కాళ్లలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే కుష్టు వ్యాధిగా అనుమానించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. అనుమానితులను ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది గుర్తించి వైద్యులకు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తారని, నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందిస్తారని వివరించారు.

కుష్టు వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నయమవుతుందని పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి సర్వేను విజయవంతం చేయాలని, వనపర్తి జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవో ఎన్‌ఎల్‌ఈపీ, పీఎంఓ, డీపీఎంఓతో పాటు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>