కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ముడా, మున్సిపల్ నిధులు రూ.45 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ హెల్త్ సెంటర్లో మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు ఆధునిక పరీక్షా పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనుభవజ్ఞుడైన వైద్యుడిని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విధి నిర్వహణలో నిమగ్నమయ్యే మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ‘ఆరోగ్య తెలంగాణ’ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సిజే బెనహర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజ్మత్ అలీ, డాక్టర్ స్యామ్యుల్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

