కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని.. వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న జీతాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంహెచ్ఎం, ఆయుష్, ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు రావాల్సిన ఉద్యోగులకు 15 తేదీ వచ్చినా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 1 వ తారీఖున వేతనాలు చెల్లించామని అన్నారు. ఎన్హెచ్ఎం, ఆయుష్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కావాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

