కలం, ఉట్నూరు : తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు అండగా నిలిచి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Bojju Patel) దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఉట్నూరు మండలం లక్కారం(Lakkaram) గ్రామపంచాయతీ పరిధిలోని రాంజీ గోండ్ నగర్‌కు చెందిన విఠల్ – గంగుబాయి దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. వారిలో ఒకరికి మూడేళ్లు కాగా, మరొకరు కేవలం ఎనిమిది నెలల పసికందు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని, వారి బాగోగుల బాధ్యతను స్వీకరించారు. గతంలో ఎమ్మెల్యే తన ఇంటికి చిన్నారిని ఆహ్వానించి, కుటుంబ సభ్యుడిగా భావిస్తూ బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఇద్దరు చిన్నారులను తమ ఇంటికి పిలిపించిన ఎమ్మెల్యే దంపతులు స్వయంగా కొత్త బట్టలు కొనుగోలు చేసి, తమ చేతులతోనే వారికి తొడిగించారు. చిన్నారులకు పాల ఖర్చులతో పాటు అవసరమైన ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని, వారి పోషణతో పాటు చదువుకు కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

