కలం, చండూరు : నల్గొండ (Nalgonda) జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Raj Gopal Reddy) గురువారం ఉదయం విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ‘మార్నింగ్ వాక్’ చేస్తూ వీధి వీధినా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇడికుడ గ్రామం నుండి తెరటిపల్లి గ్రామం వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు అభివృద్ధి పనుల్లో భాగంగా, పుల్లెంల గ్రామ పరిధిలో జరుగుతున్న నిర్మాణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ విస్తరణలో గ్రామ పరిధిలో పాక్షికంగా, పూర్తిగా కోల్పోతున్న ఇళ్ల వివరాలపై అధికారుల నుంచి ఆరా తీశారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ భవనం, కమ్యూనిటీ హాల్‌లను పరిశీలించారు. వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసిన ప్రతిపాదనలు, అంచనాలను తక్షణమే రూపొందించాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. అలాగే గ్రామాన్ని అనుసంధానించే అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి టెండర్ల ప్రక్రియపై చర్చించారు.
గ్రామంలోని నిరుపేదల గుడిసెలను నేరుగా సందర్శించి, వారి జీవన పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఇందిరమ్మ ఇళ్లు నిలిచిపోయిన అర్హులైన నిరుపేదలను గుర్తించి, ప్రత్యేక జాబితా రూపొందించాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో గ్రామంలో నూతనంగా పూర్తయిన ఇందిరమ్మ గృహాన్ని ఆయన ప్రారంభించారు. పుల్లెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే, తరగతి గదులు ఇరుకుగా ఉండటాన్ని గమనించారు. విద్యార్థులకు విశాలమైన ఆటస్థలంతో పాటు నూతన పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన భూమిని చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.
గ్రామంలో 26 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన రాజగోపాల్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజోపయోగ భవనాలు, పాఠశాలల నిర్మాణం కోసం ఆ భూములను కేటాయించాలని కోరారు. గ్రామాభివృద్ధికి కావలసిన మరిన్ని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

