కలం, పెద్దపల్లి: ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Vijaya Ramana Rao) తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి వద్ద డి-83, డి-86 ప్రధాన కాల్వల ద్వారా సరఫరా అవుతున్న సాగునీటి పారకాన్ని ఆయన నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంటలకు చివరి తడులు అందక రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించి ఎస్సారెస్పీ నీటి విడుదలకు ఒప్పించినట్లు వెల్లడించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ రైతుల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుందని, వాస్తవాలు గ్రహించకుండా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
రూ. 63 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అనంతరం పెద్దపల్లి (Peddapalli) ఆర్.కె గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 63 మంది లబ్ధిదారులకు రూ. 63,07,308 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్, ఉచిత సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు.
ఎల్ నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడినందున రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, తహసీల్దార్, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

