తుర్కపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కలం, ఆలేరు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా చేరవేయడంలో రేషన్ కార్డులు అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని రంగ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు కార్డులు అందజేసిన అనంతరం, అక్కడ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు.

ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah)మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు, సమాజం వేగంగా అభివృద్ధి చెందుతాయని  తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని బీర్ల అయిలయ్య కొనియాడారు.

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు, అక్కాచెల్లెళ్లతో కలిసి ఆయన బతుకమ్మ ఆడి సంబరాల్లో మునిగితేలారు. రాష్ట్ర ఆడపడుచులందరికీ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి మాత ఆశీస్సులతో ఎల్ నినో ప్రభావం తగ్గి, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురువాలని ఆకాంక్షించారు. రైతన్నలకు సాగునీరు పుష్కలంగా అంది, పంటలు బాగా పండి ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని బతుకమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>