ఎమ్మెల్యే చొరవతో స్వగ్రామానికి చేరిన ఆదిత్య మృతదేహం

కలం, సోన్: కుటుంబానికి అండగా నిలవాలని, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఆ యువకుడు.. చివరకు విగతజీవిగా స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్న ఆ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగియడంతో సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన తోకల తిరుపతి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు ఆదిత్య (Aditya) ఐదు నెలల క్రితం ఉపాధి నిమిత్తం టర్కీ దేశానికి వెళ్లాడు.

అక్కడ భవన నిర్మాణ పనులు చేస్తుండగా సెప్టెంబర్ 14న ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ( MLA Alleti Maheshwar Reddy)ని సంప్రదించగా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి వైద్య సహాయం అందేలా ప్రయత్నించారు. అయితే, మృత్యువుతో పోరాడిన ఆదిత్య అక్టోబర్ 15న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

ఆదిత్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కృషితో ఆదిత్య మృతదేహం గురువారం మాదాపూర్ గ్రామానికి చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>