కలం, ఖమ్మం బ్యూరో: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మూడు నెలల్లోనే అదనపు తరగతి గదులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.1.30 కోట్లతో చేపట్టనున్న 5 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శనివారం శంకుస్థాపన చేశారు. ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి పనుల పురోగతిని పరిశీలించి సమీక్షించాలని అధికారులకు సూచించారు.
వెంటనే కొత్త విద్యుత్ మీటర్లు..
వైఎస్ఆర్ కాలనీలోని ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ మీటర్లను అందించేలా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కాలనీవాసులు అక్రమంగా విద్యుత్ వినియోగించకుండా, ప్రతి ఇంటికీ సరైన విద్యుత్ మీటర్ ఉండేలా చూసుకోవాలన్నారు. వెంటనే ఇంటి పన్ను ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. 2023లో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి పెండింగ్ సమస్యలను గుర్తించి, త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అధికారులు పాల్గొన్నారు.

