కాంగ్రెస్ వల్లే పడిపోయిన సింగరేణి.. రూ.10 వేల కోట్ల భారీ స్కామ్‌: కేటీఆర్

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ గుండెకాయ వంటి 137 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీయించి బడా బాబులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికుల స్వేదానికి, త్యాగాలకు వెన్నుపోటు పొడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్మిక లోకం త్వరలోనే చరమగీతం పాడుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కాంగ్రెస్ అవినీత్ పాలనకు పడిపోయిన సింగరేణి..

ఈ సభకు మిర్యాల రాజిరెడ్డి అధ్యకత వహించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం దిగిపోయే సమయానికి సింగరేణిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే, కాంగ్రెస్ నిర్లక్ష్యం, అవినీతి పాలన వల్ల 2025-26 నాటికి అది 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని కేటీఆర్ గణాంకాలతో సహా విమర్శించారు. సింగరేణిలో ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని, ఈ ‘కోల్ మాల్’ గోల్ మాల్ వెనుక ఉన్న దొంగలు ఎవరో తేలాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ. 60,000 కోట్ల బకాయిలను పేరుకుపోయేలా చేసి, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అందకుండా చేస్తూ కరెంట్ కోతలకు సింగరేణిపై నెపం నెట్టే కుట్ర జరుగుతోందన్నారు.

కుంభకోణాల ఘనిగా సింగరేణి.. వరుస స్కామ్‌లపై ధ్వజం

సిరుల సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ‘కుంభకోణాల ఘనిగా’ మార్చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నైనీ బ్లాక్ కుంభకోణాన్ని అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ. 30,000 కోట్లు మిగిలాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డి మింగుదామనుకుంటే, వాటాలు కుదరక వారే కుంభకోణాలను బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ రూల్ పేరిట రూ. 10,000 కోట్ల భారీ స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. సోలార్, జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్లలోనూ వరుస అక్రమాలు జరుగుతున్నాయని, ఆధారాలతో సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశామని, గవర్నర్‌ను కలిసి సమగ్ర విచారణ కోరామని వెల్లడించారు.

కార్మికుల బోనస్‌లలో కోత

కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాల్లో 32 శాతం బోనస్‌గా ఇచ్చి ఇళ్లల్లో వెలుగులు నింపితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్‌లను దారుణంగా తగ్గించి కార్మికుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. కేసీఆర్ పునరుద్ధరించిన డిపెండెంట్ (వారసత్వ) ఉద్యోగాల ప్రక్రియను కాంగ్రెస్ నిలిపివేసిందని, మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డుల పేరిట కార్మికులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఇళ్ల స్థలాలు, హక్కు పత్రాల పంపిణీని నిలిపివేయడాన్ని తప్పుపట్టారు.

ఉద్యమాల గడ్డపై నుంచి అసెంబ్లీ ముట్టడి హెచ్చరిక

“తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి స్వరాష్ట్రాన్ని సాధించిన మొనగాళ్లు సింగరేణి కార్మికులు. తెలంగాణ వచ్చేనాటికి 7,700 మెగావాట్లు ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కేసీఆర్ 24,000 మెగావాట్లకు పెంచారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమవుతుందని ముందే చెప్పాం.. అది నేడు నిజమైంది” అని కేటీఆర్ గుర్తుచేశారు.

తగ్గించిన బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని, డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను తక్షణమే సరళతరం చేయాలన్నారు. సింగరేణి నిధులను ఢిల్లీ పెద్దలకు ‘ఏటీఎం’గా వాడుకోవడం ఆపాలని, తగ్గించిన బోనస్ బకాయిలు చెల్లించకపోతే గోదావరిఖని గడ్డపై నుంచి ఎగసిన ఈ కార్మిక గర్జన హైదరాబాద్‌లోని అసెంబ్లీని ముట్టడించే వరకు విశ్రమించదని కేటీఆర్ స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సిరికొండ మధుసూదనాచారి, కోరుకంటి చందర్, బాల్క సుమన్, తాటిపర్తి జీవన్ రెడ్డి, పుట్ట మధుకర్, పాడి కౌశిక్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, నడిపల్లి దివాకర్ రావు, కోవా లక్ష్మి, దుర్గం చిన్నయ్య, భూక్య జాన్సన్ రాథోడ్, కౌశిక హరి, కోలేటి దామోదర్, సుంకే రవిశంకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మూల విజయ రెడ్డి, పీటీస్వామి తదితర నేతలు, వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>