దుమ్ముగూడెంలో కొమరం భీం విగ్రహావిష్కరణ.. పోటెత్తిన ఆదివాసీలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు వై జంక్షన్ వద్ద గురువారం ఆదివాసీ జాతి పోరాట యోధుడు, మన్యం వీరుడు కొమరం భీం విగ్రహావిష్కరణ (Komaram Bheem Statue)కార్యక్రమం ఆదివాసీ జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క (Minister Seethakka) ముఖ్య అతిథిగా విచ్చేయగా, పినపాక శాసనసభ సభ్యులు, తెలంగాణ అసెంబ్లీ మండలి ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

వీరితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పలు ఆదివాసీ సంఘాల నేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పినపాక శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆదివాసీ సమాజం, యువత విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరింత ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ జాతి యుగపురుషుడు కొమరం భీం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ ఆదర్శాలను భావితరాలకు అందించాలని తెలిపారు.

ఆదివాసీల గౌరవప్రదమైన జీవనానికి కట్టుబడి ఉంటూ, ఆదివాసీ సమాజం ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా జీవించాలనే లక్ష్యంతో ఆయన చేసిన మహా పోరాటం ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. జల్.. జంగల్.. జమీన్ అనే నినాదం ఆదివాసీల హక్కులు, వారి జీవన విధానం, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచిందని, ఇదంతా మహనీయుడు కొమరం భీమ్ చూపిన మార్గమేనని ఆయన స్ఫూర్తిని, కీర్తిని ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన ఆదివాసులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>