కలం, ఖమ్మం బ్యూరో: జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు (Khammam Rice Inspections) నిర్వహించారు. నగరంలోని ప్రకాష్ నగర్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో ఉన్న బియ్యం వ్యాపారుల దుకాణాలను డిప్యూటీ తహశీల్దార్లతో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ తనిఖీ చేశారు.
ఈ తనిఖీల సందర్భంగా వ్యాపారులు సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల నుండి కొనుగోలు చేసిన బియ్యానికి సంబంధించిన బిల్లులు, వే బిల్లులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి దుకాణం ప్రధాన ద్వారం వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల పరిమాణం, వాటి ధరల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని వ్యాపారులను ఆదేశించారు.
బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించడం గానీ, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం గానీ చేయరాదని జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

