కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ నిల్వలు, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ చిట్టిబాబు పర్యవేక్షణలో త్రీ టౌన్ ఎస్సై బి. కొండలరావు తన సిబ్బందితో కలిసి వెంకటేశ్వర నగర్లోని(Venkateswara Nagar) బానోత్ దేవి నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 1 కిలో 115 గ్రాముల గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బానోత్ సాయిరామ్ అలియాస్ సంజయ్ వివిధ మార్గాల ద్వారా గంజాయిని సమకూర్చగా, బానోత్ దేవి, ఆమె చిన్న కుమారుడు సంతోష్ వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారిని రిమాండ్కు పంపింది. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సై కొండలరావుతో పాటు పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

