కలం, కరీంనగర్: సద్దుల బతుకమ్మతో పాటు దుర్గామాత నిమజ్జన ఉత్సవాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి నిమజ్జనం ఘాట్లను స్వయంగా పరిశీలించారు.
కరీంనగర్ (Karimnagar)లోని మానేరు డ్యాం, మానేరు వాగు పరివాహక ప్రాంతాలలోని మార్కండేయ నగర్, శివనగర్, సప్తగిరి కాలనీ, సీఎం పాయింట్, రాంచంద్రపూర్, లేక్ పోలీస్ స్టేషన్, గౌతమీనగర్, వేదభవన్, కొత్తపల్లి, గోపాల్పూర్, దుర్షేడ్ తదితర నిమజ్జనం ఘాట్లలో జరుగుతున్న పనులను వారు తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ ద్వారా రూ. 3 కోట్ల నిధులతో లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్టోన్ డస్ట్తో చదును పనులు, బారికేడింగ్, స్టేజ్ నిర్మాణంతో పాటు ఇతర ముమ్మర ఏర్పాట్లను పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
తొలిసారిగా దుర్గామాతల నిమజ్జనం ఏర్పాట్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు ఈ నెల 21వ తేదీన జరిగే దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రథమంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మానకొండూర్, కొత్తపల్లి చెరువు పాయింట్లను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఈ రెండు నిమజ్జనం పాయింట్లలో క్రేన్లు, లైటింగ్ సిస్టమ్, బారికేడింగ్, తాగునీరు, గజ ఈతగాళ్ళు, పారిశుధ్య నిర్వహణ తదితర సౌకర్యాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ-వేణు, మాసం గణేష్, ఎపిపి చంద్ర, తెల్ల లక్ష్మీ-రమేష్, ఆకుల నర్మద-నర్సయ్య, చాడగొండ కవిత-బుచ్చిరెడ్డి, సౌగని కొమురయ్య, నాంపల్లి రేణుక-శ్రీనివాస్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

