కలం, కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీ(Cycle Rally)లో కరీంనగర్ రన్నర్స్, సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, డాక్టర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ర్యాలీ మార్గం వివరాలు..
ఆదివారం ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్, శివ థియేటర్ సర్కిల్, కెమిస్ట్ భవన్ మీదుగా సాగింది. అనంతరం ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకుని, కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా ప్రయాణించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసిందని సీపీ తెలిపారు. కార్యక్రమ అనంతరం సీపీ ర్యాలీలో పాల్గొన్న సభ్యులకు అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
అక్టోబర్ 31 వరకు వారోత్సవాలు..
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా గౌష్ ఆలం (CP Gaush Alam) తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏసిపిలు వెంకటస్వామి, విజయకుమార్ కమిషనరేట్ చెందిన ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కరీంనగర్ కమిషనరేట్ రన్నర్స్ మరియు సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ పాసుల, డాక్టర్ కిరణ్, అడ్వకేట్ తిరుపతి లతో పాటు పాఠశాల విద్యార్థులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Also Read : మోడీ వారణాసి టూర్: గంగపై వైమానిక విన్యాసాలు!
Follow Us On : WhatsApp

