కలం, స్పోర్ట్స్ : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌పై ఆసక్తి పెరుగుతున్న వేళ.. ఛాలెంజర్ జవోఖిర్ సింధరోవ్ (Javokhir Sindarov) మాత్రం ఇప్పుడే గుకేశ్ (Gukesh) తో పోరుపై దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం తన ముందున్న టోర్నీలపైనే ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఈ ఏడాది సైప్రస్ క్యాండిడేట్స్ టోర్నీలో సింధరోవ్ విజేతగా నిలిచాడు. దీంతో ప్రపంచ టైటిల్ కోసం పోటీ చేసే అవకాశం దక్కింది. అంతకుముందు 2025లో గోవాలో జరిగిన ఫిడే వరల్డ్ కప్‌లోనూ సింధరోవ్ సత్తా చాటాడు.
అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావడం ఇంకా ప్రారంభించలేదని సింధరోవ్ తెలిపాడు. ముందుగా గ్లోబల్ చెస్ లీగ్, ఆ తర్వాత చెస్ ఒలింపియాడ్‌పై దృష్టి పెడతానని చెప్పాడు. ఆ టోర్నీల తర్వాతే గుకేశ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతానని వెల్లడించాడు. ఈ పోరులో మానసిక బలం కూడా కీలకమని అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ లెవోన్ అరోనియన్ అభిప్రాయపడ్డాడు. గుకేశ్ పోరాట యోధుడని, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అతనిపై భారీ ఒత్తిడి ఉండటం సహజమని పేర్కొన్నాడు.
18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్ పరిస్థితిని అరోనియన్.. గతంలో మిఖాయిల్ టాల్ ఎదుర్కొన్న పరిస్థితితో పోల్చాడు. చిన్న వయసులోనే జీవిత లక్ష్యం నెరవేరితే ఆ విజయాన్ని జీర్ణించుకోవడం కూడా సవాలుగా మారుతుందని వివరించాడు. ఇక గుకేశ్ మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడే అవకాశం ఉందని చెస్ ప్రపంచం భావిస్తోందని అరోనియన్ చెప్పాడు. అయితే సింధరోవ్‌కు ఎదురుగా ఆ వ్యూహం ఎలా పనిచేస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుందని తెలిపాడు.
ప్రపంచ టైటిల్‌ను తాను గెలవలేకపోయినందుకు ఎలాంటి బాధ లేదని అరోనియన్ స్పష్టం చేశాడు. లక్ష్యాలపై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవడం కంటే సాధించిన విజయాలను ఆస్వాదించడం మంచిదని పేర్కొన్నాడు.

