కలం, వెబ్ డెస్క్ : టర్కీలోని ప్రముఖ నగరమైన ఇస్తాంబుల్లో కుండపోత వర్షాలు (Istanbul Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది గంటల వ్యవధిలోనే 100 నుండి 190 మిల్లీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదు కావడంతో నగరం మొత్తం జలమయమైంది. పలు ప్రాంతాల్లో రహదారులు నిట్టనిలువునా కుంగిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి.
ఈ హఠాత్ ప్రవాహాల ధాటికి ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లు, పాఠశాలల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. రోడ్లపైకి చేరిన నీటిలో అనేక వాహనాలు చిక్కుకుపోగా, నగరంలో ట్రాఫిక్ దాదాపు 90 శాతానికి పైగా స్తంభించిపోయింది. వరద ప్రవాహంతో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. స్థానిక ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

