కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో నిర్వహించే సభ (Siddipet Meeting)పై సస్పెన్స్ నెలకొంది. వారం రోజుల్లో సభ ఉంటుందని సిరిసిల్ల బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ నెల ఫస్ట్ వీక్‌లోనే జరుగుతుందని ప్రచారం జరిగింది. కారణాలేవీ చెప్పకుండానే సిద్దిపేట సభ అంశంపై కాంగ్రెస్ సైలెంట్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును పబ్లిక్‌లో కార్నర్ చేయడానికి వ్యూహాత్మకంగానే సీఎం గ్యాప్ తీసుకుంటున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పదేళ్లలో హరీశ్ రావు నిర్వాకాలను బట్టబయలు చేయడం కోసం పకడ్బందీగా లెక్కలు తీసే పని ముమ్మరంగా జరుగుతోందని చర్చ నడుస్తోంది.
అదే కారణమా..?
సిద్దిపేట సభ వాయిదాకు మరో కారణం వినిపిస్తోంది. ‘సర్’ అంశంలో సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళనలకు నిర్వహిస్తోంది. వీటికి సీఎం రేవంత్ హాజరుకావాల్సి రావడం కూడా సభ వాయిదాకు కారణమన్న వాదనగా చెబుతున్నారు. ‘ఇండియా’ కూటమి తరఫున హైదరాబాద్‌లో లక్షలాది మందిని సమీకరించి భారీ స్థాయిలో సభ నిర్వహించనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ సభకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి సైతం ఆ సభను సక్సెస్ చేసి, మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దసరా మూడ్ ఉన్నందున, ఆ సందడి ముగిసిన తర్వాతే ఇండియా కూటమి సభ నిర్వహించాలనే అభిప్రాయం పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ఈ నెల చివరలో జరుగుతుందా? లేక వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో ఉంటుందా? అనే అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇండియా కూటమి పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాత తేదీ ఖరారు కానుంది. కూటమి సభ తర్వాతే సిద్దిపేట సభ మీద దృష్టి సారించాలని సీఎం, పీసీసీ చీఫ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గ్యాప్‌లో లెక్కల సేకరణ..
హరీశ్ రావు టార్గెట్‌గా సిద్దిపేట సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఇటీవలి పరిణామాలతో ఏఐసీసీ కార్యక్రమాల మీదనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ కారణంగానే సిద్దిపేట సభ గురించి ఆలోచించలేదని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా జరిగిన భూకబ్జాలు, ప్రజాధనం దుర్వినియోగం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరిగిన అక్రమాలు.. వీటన్నింటి లెక్కలు తీసే పని మొదలైందని తెలిపాయి.
‘ఇండియా’ కూటమి సభ పూర్తయ్యేంత వరకు సిద్దిపేట సభ గురించి ఆలోచించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఢిల్లీ తరహాలో ఈ సభ నిర్వహించాల్సి ఉన్నందున.. కేవలం జన సమీకరణకు మాత్రమే పరిమితం కాకుండా కూటమి పార్టీల నేతలందరూ హాజరయ్యేలా చూడడం, వారికి అనువైన తేదీలను పరిగణనలోకి తీసుకోవడం, ఒక ఉమ్మడి వేదిక మీదకు తీసుకురావడానికి పలువైపుల నుంచి సమాచారాన్ని సేకరించడం.. ఇవన్నీ కీలకంగా మారాయి.
మరిన్ని కారణాలు..
- ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఎల్ నినో కొనసాగుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు సాగునీరు, నగరానికి తాగునీరు తక్షణ సమస్యలుగా మారాయి. వీటి పరిష్కారం, ప్రత్యామ్నాయంపై వివిధ డిపార్టుమెంట్లలో రివ్యూలు మొదలయ్యాయి.
- మరోవైపు డొమెస్టిక్, ఇండస్ట్రియల్, కమర్షియల్, అగ్రికల్చర్ కరెంటు సరఫరా, ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు, థర్మల్ ఉత్పత్తి పెంపు.. ఇవి కూడా ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యాలుగా మారాయి.
- ఇవన్నీ ఇలా ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, రెండు స్థానాల్లో గెలవాలన్న టార్గెట్, వచ్చే నెల ఫస్ట్ వీక్‌లోగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయడం.. ఇవి కూడా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కీలక అంశాలుగా మారాయి.
- డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మూడు రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహణ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం కూడా మరో కారణం.

