కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అత్యాధునిక గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్రంలో 4,276 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు పురోగతిపై హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధుల బృందం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్ల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ ప్రతినిధులను సీఎం కోరారు.
678 ఎకరాల్లో ఏర్పాటు..
జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో దాదాపు 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ కేంద్రాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాహన పరిశోధనలు, అధునాతన ఇంజినీరింగ్ డిజైన్లు, వాహన పరీక్షలు, వాటి పనితీరు ధ్రువీకరణ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా భారీ వాహనాల నాణ్యతను పరీక్షించడానికి ప్రత్యేక ట్రాక్లు, అత్యాధునిక ల్యాబ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న హ్యుందాయ్ ఇంజినీరింగ్ కేంద్రానికి అదనంగా ఈ సరికొత్త ప్లాంట్ ఏర్పాటు కానుంది.
కార్ల తయారీ ప్లాంట్ పెట్టాలని సీఎం వినతి..
హ్యుందాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను కూడా స్థాపించాలని కంపెనీని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సింగిల్ విండో అనుమతులు, మౌలిక వసతులను వేగంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉండటం, మెరుగైన అంతర్జాతీయ రవాణా కనెక్టివిటీ, శాంతిభద్రతలు తెలంగాణకు ప్రధాన సానుకూలతలని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికలను సైతం సీఎం ఈ సందర్భంగా వారికి వివరించారు.
ఇన్వెస్ట్ తెలంగాణకు ఆహ్వానం..
రానున్న కొన్ని నెలల్లోనే ఈ భారీ ఆర్అండ్డీ కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే డిసెంబర్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ లో పాల్గొనాల్సిందిగా హ్యుందాయ్ యాజమాన్యాన్ని సీఎం ఆహ్వానించగా, అందుకు సంస్థ ఎండీ చాంగ్యోన్ చో సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వామ్యానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని హ్యుందాయ్ స్పష్టం చేసింది. సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రీతమ్ జైన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

