కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, బెతుల్ ప్రాంతాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన భక్తులు ఖాటూ శ్యామ్జీ ఆలయ దర్శనం కోసం మినిబస్సులో బయలుదేరారు. రాజస్థాన్లోని కోటా జిల్లా సిమ్లియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోల్ నంబర్ 384 వద్ద దారుణం (Kota accident) చోటుచేసుకున్నది.
శనివారం వేకువజామున సుమారు 6 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న 15 అడుగుల లోతు డ్రెయిన్లో పడిపోయింది. డ్రెయిన్ లోపల బురద, నీరు నిలిచి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. స్థానిక పోలీసులు, అత్యవసర బృందాలు క్రేన్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరొక 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కోటాలోని ఎంబీఎస్ ఆసుపత్రి, న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే వాహనం అదుపుతప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

