కలం, మెదక్ జిల్లా: సిద్దిపేట పట్టణం అద్దంలా మెరుస్తోందంటే దానికి కారణం పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమేనని, పట్టణ స్వచ్ఛతకు కార్మికులే అసలైన అలంకారమని, కార్మికుల కష్టం వల్లనే సిద్దిపేటకు దేశంలోనే ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) కొనియాడారు.
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుధ్య కార్మికులతో హరీశ్ రావు ఆత్మీయంగా ముచ్చటించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని తన సొంత ఖర్చులతో కార్మికులను సత్కరించి, ఈ సందర్భంగా మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్, షర్టులను పండుగ కానుకగా అందజేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… చలిని, వానను లెక్కచేయకుండా చేతిలో చీపురు పట్టి శ్రమించిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల శ్రమే సిద్దిపేటను దేశంలోనే అగ్రగామిగా నిలిపిందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే వేతనాలు రెట్టింపు
గతంలో కాంగ్రెస్ హయాంలో పారిశుధ్య కార్మికులకు కేవలం రూ. 8,300 జీతం మాత్రమే ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వేతనాన్ని రూ. 16,600కు పెంచి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. అంతేకాకుండా మధ్యవర్తులు, కాంట్రాక్టర్ల దోపిడీకి స్వస్తి పలికి, నేరుగా గ్రూపుల ద్వారా కార్మికుల ఖాతాల్లోనే జీతాలు పడేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కార్మికులకు ఒక్క రూపాయి జీతం పెంచలేదని విమర్శించారు. ఒకవైపు జీతాలు పెంచకపోయినా… నిత్యావసర సరుకుల ధరలు, బస్సు ఛార్జీలు, కరెంట్ బిల్లులను మాత్రం విపరీతంగా పెంచి సామాన్యులపై, కార్మికులపై తీవ్ర భారం మోపారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల జీతాలను తక్షణమే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రమభారాన్ని తగ్గించాం
సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, స్వీపింగ్ మిషన్లు, చెత్తకుండీల తొలగింపు, ఇంటింటికీ ఆటోల ఏర్పాటు, పందుల నివారణ వంటి అనేక చర్యలు చేపట్టి పారిశుధ్య కార్మికులకు శ్రమభారాన్ని తగ్గించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచే వరకు, అలాగే మిగతా విభాగాల వారికి కూడా గ్రూప్ విధానాన్ని వర్తింపజేసేలా శాసనసభ (అసెంబ్లీ) వేదికగా ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

