ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్.. ఉత్తర్వులు జారీ

కలం, వెబ్ డెస్క్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ (సీఐ) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి (Ghatkesar CI Balaswamy) పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సీపీ సుమతి బుధవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులతో పాటు ఇతర కేసుల్లోనూ నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు భయపడుతున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ పనితీరు, వ్యవహారశైలిపై 12 మందికి పైగా ఫిర్యాదుదారులు ఏసీపీ నుంచి పోలీస్ కమిషనర్ వరకు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తమకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ ఫిర్యాదులు సమర్పించారు.

ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించి నివేదిక రూపొందించినట్లు సమాచారం. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యల్లో భాగంగా బాలస్వామిని సస్పెండ్ చేస్తూ సీపీ సుమతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యతలో ఉన్న అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇకపోతే గతంలో ఘట్‌కేసర్‌లో పనిచేసిన సీఐ (Ghatkesar CI) కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం.

Also Read : సీజేపీ నేతల అరెస్ట్.. జగన్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>