కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup) ప్రారంభానికి ముందే జర్మనీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ దేశ స్టార్ మిడ్‌ఫీల్డర్, 18 ఏళ్ల లెన్నార్ట్ కార్ల్ (Lennart Karl) గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. చికాగోలో జరిగిన చివరి శిక్షణా శిబిరంలో కార్ల్ ఎడమ తొడ కండరం చిరిగింది. జర్మనీ తన మొదటి మ్యాచ్ ఆడటానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరిగింది. శిక్షణ మధ్యలోనే కార్ల్ బయటకు వచ్చేయడంతో హెడ్ కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్ అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి అంత బాగా లేదని ఆయన అన్నారు.
ఆ తర్వాత ఆసుపత్రిలో చేసిన ఎంఆర్ఐ స్కాన్‌లో గాయం తీవ్రత బయటపడటంతో, అతను వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు. దీంతో ఫిఫా నిబంధనల ప్రకారం కార్ల్ స్థానంలో అసన్ ఔడ్రాగోను జర్మనీ జట్టులోకి తీసుకున్నారు. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన టోర్నమెంట్‌కు దూరం కావడంపై లెన్నార్ట్ కార్ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెద్ద టోర్నీని మిస్ అవ్వడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందన్నారు.
వరల్డ్ కప్ కోసం తాను ఎంతో శ్రమించానని, కానీ దురదృష్టవశాత్తూ ఇలాంటి సమయంలోనే గాయాలు అవుతుంటాయని ఆవేదన చెందారు. బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌కు ఆడే ఈ యువ ఆటగాడు ఈ ఏడాది మార్చిలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. గత వారం ఫిన్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 4-0తో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. చిన్న వయసే అయినా ఈ వరల్డ్ కప్‌లో అతను అద్భుతంగా రాణిస్తాడని అందరూ భావించారు. ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ జట్టు గ్రూప్-ఈలో ఉంది. కార్ల్ లేకపోయినా ఈసారి కూడా జర్మనీనే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జర్మనీ ఆడే గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది:
జూన్ 14: జర్మనీ వర్సెస్ కురకావో
జూన్ 20: జర్మనీ వర్సెస్ ఐవరీ కోస్ట్
జూన్ 25: జర్మనీ వర్సెస్ ఈక్వెడార్

