కలం, నల్లగొండ: రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సబ్స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒకలా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక రైతులకు సాగునీరు, కరెంట్ అందించడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి భారీ విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ, రైతులకు నిరంతరం కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ఆయన నిలదీశారు.
విద్యుత్ సరఫరాలో తరచూ వస్తున్న అస్థిరత, అంతరాయాల వల్ల రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్నదాతల గోడును పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని, నాణ్యమైన విద్యుత్ అందించి రైతులను రాజుగా చేయాలనే లక్ష్యంతో అప్పట్లో పాలన సాగిందని గుర్తుచేశారు. నేడు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని రైతులు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్తో పాటు సాగునీటిని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు.

