డంప్ యార్డ్ సమస్యపై ప్రణాళికతో ముందడుగు వేద్దాం: నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్: డంపు యార్డు సమస్య వల్ల ఒకవైపు ప్రజలు ప్రతిరోజూ ఇబ్బంది పడుతుంటే సమస్యను ఒకరిపై ఒకరు నెట్టివేసుకొని రాజకీయ లబ్ధికోసం ప్రాకులాడడమేంటని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender) మండిపడ్డారు. స్థానిక సుడా మాజీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యార్డులో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే విషయంలో అధికారులు ఇప్పటివరకు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

యార్డులో ప్రస్తుతం దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉందని, అక్కడ ఉన్న ఒక్క మిషన్‌తో రోజుకు గరిష్టంగా 500 మెట్రిక్ టన్నులకు మించి బయో మైనింగ్ చేయలేమని ఆయన వివరించారు. ఈ లెక్కన పాత చెత్తను క్లియర్ చేయడానికే కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుందని, అదీగాక ప్రతిరోజూ కొత్తగా మరో 200 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరుతోందని నరేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే నాలుగు మిషన్లతో ప్రతిరోజు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్త బయోమైనింగ్ చేయగలిగితే ఒక సంవత్సరంలో ఉన్న చెత్త మొత్తం క్లియర్ చేయగలుగుతామని, దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం కలిసికట్టుగా కృషి చేస్తేనే అది సాధ్యం అవుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. యూసీఎఫ్ నిధులు సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయించుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, దీనికోసం తాము పూర్తి సహకారం అందిస్తామన్నారు.

గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా డంపు యార్డు ఖాళీ చేయగలిగే మంచి అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. అయితే స్మార్ట్ సిటీ బోర్డులో ఉండి కీలక నేతగా వ్యవహరించిన ఆనాటి మేయర్ , పాలకవర్గం చిత్తశుద్ధి ప్రదర్శించక పోగా.. ఈనాటి పాలకవర్గంలో బీజేపీ పార్టీలో కీలక పదవి పొందిన వ్యక్తిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బ్యాక్ ఫ్రంట్ పెట్టుకుని ఇతరులను నిందించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సేకరించడంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయని.. మానిటరింగ్ సరిగా చేస్తే ఫ్రెష్ వెస్ట్ ను తగ్గించవచ్చని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతానికి పొగ బారినుండి ఉపశమనం పొందేందుకు నాలుగు వైపులా బోర్లు వేసి స్పింక్లర్లు ఏర్పాటు చేస్తే సత్వరం పొగకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని నరేందర్ రెడ్డి కోరారు.

నాయకులు క్రెడిట్ కోసం ప్రాకులాడడం మాని చిత్తశుద్ధి తో ముందుకు సాగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నరేందర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు మాట్లాడితే తనపై చెంచాలతో ఎదురుదాడి చేపిస్తున్నారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. 35 సంవత్సరాలుగా నిబద్ధతతో ఒకే పార్టీలో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని, తనను ప్రజలు కోరుకున్న రోజు ఆపడం ఎవరితరం కాదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి తాజ్, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, ఎండి చాంద్, దండి రవీందర్, గుడిపాటి రమణా రెడ్డి, బషీర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>