కలం, బైంసా : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Ramarao Patel) సూచించారు. మంగళవారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని (Dhammachakra Pravartan Day) పురస్కరించుకుని బైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడంలో అంబేద్కర్ చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. పేదరికంలో జన్మించి, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అంబేద్కర్ తన జీవితంతో నిరూపించారని తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్వయం సమృద్ధి సాధిస్తూ సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

